Gujarat AAP: గెలిచిన ఆప్ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి..?
Gujarat AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి ఫిరాయింపుల బాధలు ఎదురవుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు కూడా పూర్తికాలేదు. అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐదుగురిలో ముగ్గురు మొన్నటిదాకా బీజేపీ ఎమ్మెల్యేలే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో వీరు ఆప్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఫలితాల్లో బీజేపీ విజయం సృష్టించడంతో వీరు కూడా కమలదళంలో కలిసేందుకు సిద్ధమౌతున్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఆప్ 13 శాతం ఓట్ బ్యాంక్ సాధించి, ఐదు అసెంబ్లీ స్థానాల్ని గెలిచింది.గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందే జంపింగ్ చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు సిద్ధమైపోవడం ప్రకంపనలు రేపుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గుజరాత్‌లో కొత్తగా గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతుండటం ఆ పార్టీ వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి.