పాక్ గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టిన భారత్
జాతీయ జెండాకు సంబంధించి భారత్ సరికొత్త రికార్డుకు యత్నించింది. సుమారు 77, 700 మంది ప్రజలు భారత జెండాలను ఏకకాలంలో గాల్లో అటూఇటూ ఊపుతూ 18 ఏళ్ల క్రితం పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టేందుకు యత్నించారు. బిహార్‌లోని జగ్దీష్‌పుర్‌లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా 1857 తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైన అప్పటి జగ్దీష్‌పుర్ రాజు వీర్‌కున్వర్ సింగ్ 164 వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇక జాతీయ జెండాలను పట్టుకుని ఏక కాలంలో 5 నిమిషాల పాటు అటూ ఇటూ ఊపుతూ రికార్డుకు యత్నించారు. బిహార్ బీజేపీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఆర్‌కె సింగ్, నిత్యానంద రాయ్, బిహార్ ఉప ముఖ్యమంత్రులు తార్‌కిశోర్ ప్రసాద్, రేణు దేవి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తదితరులు హాజరయ్యారు. గిన్నిస్ సంస్థ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని లెక్కించడానికి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా చేతులను లెక్కించే బ్యాండ్‌లు కూడా అమర్చారు. 2004లో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీలు తమ దేశ జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో అటూ ఇటూ ఊపుతూ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు భారత్ పేరిట కొత్త రికార్డు నమోదయింది.