G 20 Foreign Ministers Meeting: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ కీలక వ్యాఖ్యలు
G 20 Foreign Ministers Meeting: ఈ ఏడాది జీ 20 దేశాల సదస్సు భారత్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు ముందు వివిధ కోణాల్లో సమస్యలను చర్చించేందుకు, చర్చించబోయే అంశాలను తెలుసుకునేందుకు ముందస్తుగా సమావేశాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీన రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో జీ 20 విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీ 20 దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. రష్యా, అమెరికా, చైనా దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, ఈ సమావేశం యావత్తు ఉక్రెయిన్, రష్యా దేశాల యుద్ధం చుట్టూనే నడిచింది.
అయితే, భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో యుద్ధాల పేరిట శతృత్వం పెంచుకోవడం మంచిది కాదని, ఇది యుద్ధాల యుగం కాదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాలను నివారించడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని విదేశాంగ శాఖా మంత్రులు నిర్ణయించారు. యుద్ధాల వలన కలిగే నష్టాలను, ఆర్థిక, అభివృద్ధి పరంగా వచ్చే ఇబ్బందులపై విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. జీ 20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు నేడు కూడా కొనసాగనున్నది. ఈ సదస్సులో నేడు ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉన్నది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆ రెండు దేశాలు దౌత్యపరంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.