Free Breakfast in Tamil Nadu Schools: స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ బడుల్లో ఉచిత అల్పాహారం
తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇక నుంచి బ్రేక్ఫాస్ట్ ఉచితంగా అందించనుంది. మొదటి దశలో 15 జిల్లాల్లో 292 పంచాయితీలలో ఈ కార్యక్రమం ట్రయల్ బేస్ మీద అమలు చేస్తారు. ట్రయల్ బేస్ ద్వారా అమలు జరిపిన తర్వాత ఉచిత అల్పాహార పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. తమిళనాడు విద్యాశాఖలో కీలక అధికారి ఒకరు ఈ విషయాలను వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
ఉదయం 8.15 నుంచి 8.45 లోపు
జూలై నెలలోనే ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఉదయం ఐదున్నరకే టిఫిన్ తయారీ మొదలు కానుంది. ఉదయం 7.45 నిమిషాల కల్లా అల్పాహారం తయారీ పూర్తవుతుంది. 8.15 నిమిషాల నుంచి 8.45 నిమిషాల లోపు టిఫిన్ వడ్డింపు కార్యక్రమం పూర్తి చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి
డీఎంకే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది పేద విద్యార్ధులు సరైన పోషకాహారం లేక ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలింది. అదే అంశంపై అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా తమ తమ నివేదికలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న పలు సంస్థలు
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సంస్థలు స్వాగతిస్తున్నాయి. చాలా మంది పేద విద్యార్ధులు టిఫిన్ తినకుండానే స్కూల్కు బయలుదేరుతున్నారని, మండే ఎండలో నడుచుకుంటూ స్కూల్ చేరే సరికి వారు నీరసంగా తయారవుతున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. సరైన సమయంలో సరైన ఆహారం లభిస్తే విద్యార్ధుల్లో అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
హాజరు శాతం పెరుగుదల
మిడ్ డే మీల్స్ పథకం ద్వారా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరిగింది. మధ్యాహ్నం పూట ఆహారం లభిస్తుందని అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వ బడులకు పంపుతున్నారు. స్టాలిన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో మరికొంత విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు క్రమం తప్పకుండా వస్తారని, వాళ్లలో తెలివితేటలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలలో పోషకాహారం లోపం తగ్గించడంతో పాటు వారికి క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు కూడా నిర్వహించనున్నారు. కొన్ని నెలల క్రితం సీఎం స్టాలిన్ ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.
ఏడాది పూర్తయిన సందర్భంగా వరాల జల్లు
ఈ ఏడాది మే 7న స్టాలిన్ అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కొన్ని వరాలు ప్రకటించారు. అందులో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ఉచిత అల్పాహార పథకం కూడా ఉంది. వీటితో పాటు విద్యావసతులను మెరుగపరుస్తానని కూడా స్టాలిన్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పట్టణాల తరహాలోనే పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిని చేపడతామని కూడా స్పష్టం చేశారు.