Congress MP’s Suspended : నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
Four Congress MP’s Suspended From Lok Sabha : లోక్సభలో ప్లకార్డులు పట్టుకుని ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో లోక్ సభ జూలై 26వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్లను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలను వాయిదా వేసే ముందు స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం గందరగోళానికి దారి తీసింది. రూల్ 374 ప్రకారం ధరల పెరుగుదలపై సభలో ఆందోళనకు దిగిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు.
ద్రవ్యోల్బణం, వంటగ్యాస్ ధరల పెంపు సమస్యలపై కేంద్రంతో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సోమవారం సభలో ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మందలిస్తూ సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఓం బిర్లా మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య దేవాలయమని, సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులదేనని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోక్సభ స్పీకర్ మాట్లాడుతూ “మీరు చర్చించాలనుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీరు సభలో ప్లకార్డులు మాత్రమే చూపాలనుకుంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు సభ వెలుపల అలా చేయవచ్చు” అంటూ సభలోకి ప్లకార్డులు తీసుకొచ్చిన ఎంపీలను సభా కార్యక్రమాల్లో పాల్గొననివ్వబోమని లోక్సభ స్పీకర్ హెచ్చరించారు. ఓం బిర్లా పార్లమెంటు దిగువ సభ లోపల పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించగా, ప్రతిపక్ష ఎంపీలు ద్రవ్యోల్బణం, ఎల్పిజి ధరల పెంపు, ఇతర సమస్యలపై సందేశాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ స్పందించింది. తమ ఎంపీలను సస్పెండ్ చేసి తమను భయపెట్టాలని చూస్తున్నారని, తమ ఎంపీలు ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు.