ED Investigation: ముగిసిన తొలి రోజు సోనియా గాంధీ ఈడీ విచారణ…25న మళ్లీ రావాలని సమన్లు
ED Questioned Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఐదుగురు అధికారులతో కూడి ఈడీ బృందం సోనియా గాంధీని 3 గంటల పాటు విచారించింది. అనంతరం తొలిరోజు విచారణ ముగిసినట్లు ప్రకటించిన అధికారులు సోనియాను ఇంటికి పంపించారు.
మరోవైపు ఇదే కేసులో ఈ నెల 25న మరోసారి తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు సోనియా గాంధీకి సమన్లు జారీ చేశారు. విచారణ ముగుస్తున్న సమయంలో సోనియాకు వారు సమన్లు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఈడీ కార్యాలయంలో సోనియాను విచారిస్తున్నంతసేపు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ అదే కార్యాలయంలోని వేరే గదిలో వేచి చూశారు. ఇటీవల కోవిడ్ భారీన పడ్డ సోనియా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోవిడ్ నుంచి కోలుకుంన్నారు.
సోనియా గాంధీని ఈడి అధికారులు విచారిస్తున్న సమయంలో ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆందోళన కారులపై పోలీసులు వాటర్ కేనాన్స్ ప్రయోగించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సోం, బెంగాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు.