కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
Exchange of 2000 Rupee Notes: కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది. రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 (నేటినుండి) నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ.20వేల వరకు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందీ లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియకు గడువు విధించింది ఆర్బీఐ. దీని కోసం ఎవ్వరూ ఎలాంటి గుర్తింపు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కాగా 2018-19లోనే ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా తాజాగా రూ.2వేల నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, రూ.2వేలు నోటు అనేది ప్రస్తుతం లావాదేవీలకు వినియోగించుకోవచ్చని (లీగల్ టెండర్) స్పష్టం చేసింది. 2013-14లోనూ ఇదే తరహాలో సర్క్యులేషన్లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నామని ఆర్బీఐ గుర్తుచేసింది. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందీ లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. అయితే ఈ ప్రభావం సంపన్నులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, బంగారం వ్యాపారులపై , రాజకీయ రంగంలో ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నోట్లు మార్చుకునేందుకు నేటినుండి ప్రక్రియ నేటినుండి మొదలు కానుంది. ఇక నేటినుండి బ్యాంకుల వద్ద జనం బారులు తీరనున్నారు. ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. నోట్లు మార్చుకునేందుకు వచ్చినవారికి డబ్బు చెల్లించేందుకు 500, 200, 100 రూపాయల సరిపడా ఉన్నాయా అని అందరి అనుమానం దీనిపై కూడా ఆర్బీఐ ప్రకటన ఇచ్చింది. ప్రతి బ్యాంక్ లో చిల్లర నిల్వ ఉందని,అన్నింటికీ సరిపడా చిల్లర బ్యాంకు లో నిల్వ ఉందని తెలిపింది. 20వేల రూపాయల వరకు 2వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఎవ్వరికీ ఎలాంటి రూల్స్ లేవు. 50వేల కంటే ఎక్కువ మొత్తాన్ని మార్పిడి చేసుకోవాలన్నా, బ్యాంక్ లో డిపాజిట్ గా వేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న సొంత బ్రాంచీ, వేరే బ్రాంచ్ రూల్స్ అన్నీ వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది.
2వేల నోట్ల మార్పిడి అంశం తెరపైకి వచ్చిన తర్వాత చాలామంది బంగారం షాపులకు పరుగులు తీస్తున్నారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు నేరుగా క్యాష్ రూపేణా బంగారం కొంటున్నారు. గడిచిన 3 -4 రోజులుగా బంగారం షాపుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని వ్యాపారులంటున్నారు. దీనిపై ఐటీ శాఖ ద్రుష్టి సారించిందని సమాచారం అందుతుంది. పరిమితి దాటి బంగారం కొనుగోలు చేసే వినియోగదారుల సమాచారాన్ని అన్ని షాపులు తీసుకోవాల్సి ఉంది.. కానీ ఈ నేపథ్యంలో ఎంతమంది నుండి సమాచారం
అందుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు పెట్రోల్ పంపుల్లో కూడా ఈ నోట్లు కమిషన్ పై మారుస్తున్నారని సమాచారం పదివేలకు 1000 రూపాయలు కమిషన్ తీసుకుని మారుస్తున్నారని సమాచారం.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 500 రూపాయలే పెద్ద నోటుగా కొనసాగుతుందా లేక మళ్లీ వెయ్యి రూపాయల నోటును మార్కెట్లోకి తీసుకొస్తారా? వెయ్యి రూపాయల నోటును తిరిగి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఆర్బీఐ స్పందించి అలాంటిదేమీలేదని తెలిపింది. ప్రస్తుతం 500 రూపాయల నోటు మాత్రమే దేశంలో అతిపెద్ద నోటుగా చలామణి కానుంది.