Election Commission key decision: 80 ఏళ్లు దాటితే ఇంటి నుండే ఓటు… కర్ణాటక అసెంబ్లీ నుండి ప్రారంభం
Election Commission key decision: ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తుండగా, అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అటు కాంగ్రెస్, జేడీయు, ఇతర పార్టీలు కూడా ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. గతంలో వివిధ ప్రాంతాల్లో నివశించేవారు ఓటు వేయడం కోసం ఓ వినూత్నమైన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే పార్టీలు ఈ విషయంలో కొంత వ్యతిరేకంగా ఉన్నారు.
కాగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి గంటల తరబడి వేచి ఉండి ఓటు వేస్తుంటారు. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అలాంటి వారు నేరుగా ఇంటినుండే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఫారం 12 డీని వినియోగించుకోవచ్చని తెలియజేసింది. 80 ఏళ్లు దాటిని వారి ఇంటికి వెళ్లి అధికారులు ఓటు వేయిస్తారు. అయితే, వీరు ఎవరికి ఓటు వేశారన్నది గోప్యంగా ఉంచుతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా వీడియో రూపంలో చిత్రీకరిస్తారు. అదేవిధంగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా సాక్ష్యం అనే మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ అప్లికేషన్ ద్వారా లాగిన్ అయ్యి ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. తద్వారా ఎన్నికల పర్సంటేజ్ పెరగడమే కాకుండా, వికలాంగులు, వృద్ధులకు అసౌకర్యం కలుగకుండా ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.