ED Summons to Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రికి ఈడీ సమన్లు, జూలై 21న హాజరు కావాలని పిలుపు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జూలై 21న హాజరు కావాలని కోరింది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై దర్యాప్తు అధికారులు ఆమెను విచారించనున్నారు. గత నెలలోనే సోనియాగాంధీని విచారించాలని అధికారులు భావించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా విచారణను కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని ఆమె కోరారు. సోనియా వినతిని మన్నించిన అధికారులు నాలుగు వారాల సమయం ఇచ్చారు. తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు.
జూన్ 18న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
మనీలాండరింగ్ కేసు విషయమై సోనియాగాంధీ జూన్ 8న ఈడీ ముందు హాజరు కావలసి ఉంది. ఆ సమయంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. జూన్ 12న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. జూన్ 18న డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కొన్ని రోజుల పాటు విరామం లేకుండా ప్రశ్నించింది. సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఒక్కో రోజు దాదాపు 10 గంటల పాటు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది.
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన A.J.L ను, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన యంగ్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. యంగ్ ఇండియా కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్నారని కూడా సుబ్రహ్మణ్యస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వామి చేసిన ఫిర్యాదుతో మనీలాండరింగ్ కేసు వ్యవహారం గత కొన్ని నెలలుగా నడుస్తోంది.