మైనింగ్ లీజుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. నవంబర్ 3వ తేదీన రాంచీలోని ఈడీ ఆఫీసుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. కాగా, ఈ మైనింగ్ కేసులో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మరో ఇద్దరు అధికారులను ఈడీ ఆరెస్ట్ చేసింది. పంకజ్ మిశ్రా నుంచి నగదుతో పాటు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతకాలు చేసిన చెక్ బుక్‌లను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని మైనింగ్‌ను పంకజ్ మిశ్రా కంట్రోల్ చేస్తున్నారని, మైనింగ్ లీజ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడ్డారని, సీఎంవో కార్యాలయాన్నిదుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించగా, ఈ ఏడాది ఆగస్ట్ 25వ తేదీన ఈసీ తన నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపింది. అప్పటి నుంచి సోరెన్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ, గవర్నర్ ఈ విషయాన్ని పెండింగ్‌లో పెట్టారు. కాగా, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో మళ్లీ ఝార్ఖండ్‌లో టెన్షన్ మొదలైంది. నవంబర్ 3వ తేదీన ఈడీ ముందు సోరెన్ ఎలాంటి సమాధానాలు చెబుతారో చూడాలి.