New Delhi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది.
గుజరాత్లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ 99, కాంగ్రెస్ 77, మిగతా చోట్ల స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం పూర్తి కానున్నది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక గుజరాత్ ఎన్నికల తేదీకి ముందే ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. గుజరాత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది.