Draupadi Murmu: ప్రచారం ప్రారంభించిన ద్రౌపది ముర్ము
NDA రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె దేశంలోని ప్రముఖ నేతలకు ఫోన్లు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజకీయ కురు వృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్‌కు ఫోన్ చేసి వారి మద్దతు కోరారు.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ఇప్పటికే పలు పార్టీలు ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు పలికారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలు తమ రాష్ట్రపు ముద్దు బిడ్డకు అండగా నిలవాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ కూడా ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటించారు. జార్ధండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం కూడా ద్రౌపది ముర్ము అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ నేతల మద్దతు కోరిన జేపీ నడ్డా
ఒకవైపు ద్రౌపది ముర్ము తన ప్రచారం ప్రారంభించగా..మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలో దిగారు. ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలతో పాటు నేషనలిస్టు కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా, మాజీ ప్రధాని హెచ్.డి. దేవగౌడలకు ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు అండగా నిలవాలని కోరారు.
త్వరలోనే రాష్ట్రాల పర్యటన
ద్రౌపది ముర్ము త్వరలోనే రాష్ట్రాల పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు కలిగిన ఎంపీలను, ఎమ్మెల్యేలను కలవనున్నారు. వారి మద్దతు కోరనున్నారు.
అట్టహాసంగా నామినేషన్ ప్రక్రియ
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్వయంగా ప్రధాని మోడీ ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రపోజ్ చేస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోడీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులతో పాటు పలు పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. వైసీపీ ఎంపి విజయ సాయి రెడ్డి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలో పలువురు నాయకుల విగ్రహాలకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్, బిర్సాముండా విగ్రహాలకు నమస్కరించారు.