DK Shiva Kumar Cancels his Delhi tour due to Stomach ache
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం అభ్యర్ధిపై నెలకొన్న సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర పరిశీలకులు అందించిన సమాచారంతో పాటు వివిధ మార్గాల ద్వారా సమాచారం రప్పించుకుంటున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించే సమయం ఆసన్నమైటన్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య అక్కడ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్ తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఢిల్లీ వెళతారని అందరూ భావించారు. కానీ కడుపునొప్పి కారణంగా ఢిల్లీ వెళ్లడం లేదని శివకుమార్ వెల్లడించారు. కడుపునొప్పి కారణంగానే ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారా లేదా తాజా పరిణామాలతో అసంతృప్తితో ఉన్నారా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అనుకున్నవి అనుకుంటున్నట్లు జరగకపోవడంతో శివకుమార్ తన ప్లాన్ మార్చారు. తన ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ మనసులోకి మాటను వెళ్లడించారు. తాను అధ్యక్షుడిగా ఉండగానే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 135 స్థానాలు గెలిచిందని శివకుమార్ తెలిపారు. సిద్ధరామయ్యకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తలెత్తిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఒంటరి వాడినని, తనకు నెంబర్ల మీద నమ్మకం లేదని అన్నారు. తాను పార్టీకే విధేయుడినని, వ్యక్తులకు కాదని స్పష్టం చేశారు.