DHFL Scam: బ్యాకింగ్ రంగంలో అతిపెద్ద స్కామ్..డీహెచ్ఎఫ్ఎల్‌లో భారీ అవినీతి..!
DHFL Bank Scam:బ్యాకింగ్ రంగంలో అతిపెద్ద స్కామ్ బయటపడింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ రూ.34,615 కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసింది. దీంతో ఆ సంస్థపైన, ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధవాన్, డైరెక్టర్ ధీరజ్ వాధవాన్ లపై సీబీఐ కేసులను నమోదు చేసింది. అంతేకాదు, 8 మంది బిల్డర్లపై కూడా ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఇక బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద మోసంగా దీనిని అభివర్ణిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న అతిపెద్ద బ్యాంకింగ్ మోసం కూడా ఇదే కావడం విశేషం. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు బుధవారం రోజున ముంబైలోని 12 ప్రాంతాల్లో 50 మందికి పైగా అధికారుల బృందాలు డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ కార్యాలయాలు, సంస్థ యాజమాన్యానికి సంబంధించిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీహెచ్ఎఫ్ఎల్‌పై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. 2010 నుంచి 2018 మధ్యకాలంలో బ్యాంకుల కన్సార్టియం రూ. 42,871 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అయితే, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ఇతరులతో కలిసి వాస్తవాలను దాచడంతో బ్యాంకులను తప్పుదోవ పట్టించారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది. అంతేకాదు, 2019 నుంచి డీహెచ్ఎఫ్ఎల్ రుణాల చెల్లింపులు చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నది. బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం రూ. 36,614 కోట్ల నిధులను దారిమళ్లించి ఆస్తులను కొనుగోలు చేశారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఇక 2015 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ మధ్యకాలానికి సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాలపై ఆడిట్ ను నిర్వహించాలని కోరుతూ కేపీఎమ్‌జీ సంస్థను కోరాయి. ఈ సంస్థ నిర్వహించిన ఆడిట్‌లో డీహెచ్ఎఫ్ఎల్ చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధులు మళ్లించినట్లు పేర్కొన్నది. దీంతో యూబీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది.