DGCA Show Cause: ఎయిర్ ఇండియాకి డీజీసీఏ షో కాజ్ నోటీసులు!
DGCA Show Cause Notice To Air India Manager : విమానాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా అకౌంటబుల్ మేనేజర్‌కి డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నియంత్రణ బాధ్యతలు ఉల్లంఘించినందుకు మీ విమానయాన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని డీజీసీఏ ప్రశ్నించింది. డిజిసిఎ వివరాల ప్రకారం, డిసెంబరు 6, 2022న ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు రెండు జరిగాయి. వాటిని బాధిత ప్రయాణికులు డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లారు. మొదటి ఘటనలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో పొగ తాగుతూ పట్టుబడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. మరో సంఘటనలో మరొక ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో తోటి మహిళా ప్రయాణీకురాలి ఖాళీ సీటుపై మరియు దుప్పటిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం బెంగళూరు నుంచి అరెస్ట్ చేశారు. 6 డిసెంబర్ 2022న పారిస్-న్యూఢిల్లీ విమానంలో ప్రయాణీకుల దురుసు ప్రవర్తనకు సంబంధించి తన నియంత్రణ బాధ్యతలను ఉల్లంఘించినందుకు అతనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య ఎందుకు తీసుకోకూడదని ఎయిర్ ఇండియా అకౌంటబుల్ మేనేజర్‌కి DGCA షోకాజ్ నోటీసు జారీ చేసింది.