Joshimath: జోషిమట్ లో కొనసాగుతున్న కూల్చివేతలు
Demolision drive continuous in Joshimath area
జోషిమట్ లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కూల్చివేతలు జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న రెండు హోటళ్లను కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు బాధితులకు పునరావాస ప్యాకేజీ ఇచ్చే విషయంలో శరవేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. పునరావాస ప్యాకేజీపై చర్చలు జరపడానికి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు.
జోషిమట్ తో పాట చుట్టుపక్కల మరికొన్ని ప్రాంతాల్లో పగుళ్ళు కనిపించడంతో అధికారులు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కర్ణప్రయాగ్ ప్రాంతంలో పలు ఇళ్లకు పగుళ్లు రావడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ళను ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. జోషిమట్ ప్రాంతం నుంచి 82 కిలోమీటర్ల దూరంలో కర్ణప్రయాగ్ ఉంది. అక్కడ ఉండే బహుగుణ కాలనీలో ఉండే రెండు డజన్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పాడ్డాయి.
జోషిమట్ లో తక్షణ సాయం కోసం 8 SDRF, 2 NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ పరిస్థితినినైనా ఎదుర్కొనేందుకు రెండు హెలికాప్టర్లు సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటి వరకు 169 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.
ఇస్రో చిత్రాలు ఏం చెబుతున్నాయంటే
జోషిమట్ ప్రాంతంపై ఇస్రో సేకరించిన సమాచారం ఆందోళన కలిగించేలా ఉంది. గత 2 వారాల్లో 5.4 సెంటీమీటర్ల భూమి కుంగిపోయిందని ఇస్రో అందించిన సమాచారం తెలియజేస్తోంది. మొత్తం జోషిమట్ ప్రాంతమంతా ప్రమాదంలో ఉందని ఇస్రో తెలిపింది.
ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ జోషిమట్ ప్రాంతం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. కార్టోషాట్ ఎస్ 2 ఉపగ్రహం నుంచి సేకరించిన అనేక చిత్రాలు ప్రమాద పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఆర్మీకి చెందిన హెలిపాడ్, నరసింహ ఆలయం కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది.
NTPC పై పర్యావరణ వేత్తల మండిపాటు
జోషిమట్ లో ప్రస్తుత పరిస్థితులకు NTPC కారణమని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం NTPC చేసిన తవ్వకాల కారణంగానే జోషిమట్ లో ప్రస్తుత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని రవి చోప్రా తెలిపారు.
కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి రవిచోప్రా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందా అనే అంశంపై రవిచోప్రా రీసెర్చ్ చేపట్టారు.