Democratic Azad Party: ఆజాద్‌కు ఎదురుదెబ్బ… కాంగ్రెస్ గూటికి 17 మంది నేతలు
Democratic Azad Party: కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్న జమ్ముకాశ్మీనేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు నెలల క్రితం ఆయన డెమొక్రటిక్ అజాద్ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌ను వదిలి ఆజాద్ పార్టీలో చేరారు. అయితే, రెండు నెలలు తిరక్కముందు ఆ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చేశారు. 17 మంది సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భావోద్వేగాల నేపథ్యంలో తామంతా కాంగ్రెస్‌ను వీడామని, కానీ తప్పు తెలుసుకొని తిరిగి పార్టీలో చేరినట్లు నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సైతం ఈ విషయంపై ఓ ప్రకటన చేశారు.
జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ నేతలు రెండు నెలలు సెలవులపై వెళ్లారని, సెలవులు పూర్తికావడంతో తిరిగి పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు. ఈనెల 20 వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్ముకాశ్మీర్‌లోకి ప్రవేశించనున్నది. రాహుల్ గాంధీ పాదయాత్ర కంటే ముందుగానే నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. జమ్ముకాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌తోనే జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదానికి చెక్ పడుతుందని నేతలు చెబుతున్నారు. ఆర్టీకల్ 370 రద్దు తరువాత ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక అధికారాలు రద్దుకావడంతో అక్కడి పార్టీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.