Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠం కోసం పోటీపడుతున్న ఆప్-బీజేపీ
Delhi Mayor Election: ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. మేయర్ ఎన్నిక కోసం మున్సిపాలిటీ తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ నేత సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించారు. సత్య శర్మ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతుండగా.. బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్ ఉండగా.. బీజేపీ నుంచి కమల్ బార్గీ పోటీ పడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయం. అయితే, సత్య శర్మను ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ ఢిల్లీ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ వ్యతిరేకిస్తోంది. ఎల్జీ వీకే సక్సేనా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది.
ఢిల్లీలో పేరుకుపోయిన చెత్తను ఊడ్చేయాలంటే బీజేపీని సాగనంపాలంటూ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన నినాదం జనాల్లోకి బలంగా వెళ్లింది. దీంతో గత 15 ఏళ్లుగా ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీని ఢిల్లీ ప్రజలు పక్కనబెట్టారు. దీంతో ఆప్ మేయర్ పీఠం దక్కించుకుంటుంది అనుకున్న వేళ బీజేపీ కూడా మేయర్ పీఠానికి పోటీ పడుతుంది. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందింది. ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని ముందుగా బీజేపీ ప్రకటించింది. అయితే..గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ బీజేపీ పోటీలోకి దిగింది.
ఢిల్లీ మేయర్ పదవి ఐదేళ్లూ రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. మొదటి సంవత్సరం మహిళ, రెండో ఏడాది ఓపెన్ కేటగిరి, మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.