దేశరాజధాని ఢిల్లీలో.. చట్టాలు చేసే హక్కు, ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో నియమితులయ్యే బ్యూరోక్రాట్లపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చిచెప్పింది.
Delhi: దేశరాజధాని ఢిల్లీలో.. చట్టాలు చేసే హక్కు, ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో నియమితులయ్యే బ్యూరోక్రాట్లపై పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చిచెప్పింది. సివిల్ సర్వీసు అధికారులు ప్రజలకు సేవకులు తప్ప రాజకీయ పార్టీలకు కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికే పాలనా యంత్రాంగంపై నియంత్రణ ఉండాలి. తమను ఎవరు నియమించారనేదానితో సంబంధం లేకుండా.. ప్రభుత్వ అధికారులందరూ పాలనా యంత్రాంగం కిందికే వస్తారు అని సుప్రీంప్రధాన న్యాయమూర్తి, రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ గత నెలలో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చట్టాలు చేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోని అధికార వ్యవస్థపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఉంటుందా? లేక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉంటుందా? అన్న వివాదానికి సంబంధించి సుప్రీం తీర్పు ఈ తీర్పును వెలువరించింది. ఈ వివాదాన్ని విచారణ చేసేందుకు గాను 2022 లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారలను కేంద్ర సర్కార్ టేకోవర్ చేసుకోరాదు అని రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.
అయితే ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఎన్నికైన ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమతుల్యత పాటించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలు ఉండాలని కేంద్రం వాదించింది. లెఫ్టినెంట్ గవర్నర్ కేవలం ఓ అధికారి కాదని, పాలనాపరంగా సర్వాధికారని, రాష్ట్రపతి ప్రతినిధి, రాజ్యాంగ ప్రతినిధి అని కేంద్రం వాదిస్తుంది. భూమి, పోలీసు, న్యాయ అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలని కేంద్రం భావిస్తుంది. తాజాగా పరిపాలనా అధికారాలు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసింది. అత్యున్నతస్థాయి అధికారుల బదిలీలు, నియమాలకోసం కేంద్రం ఓ ఆర్డినెన్స్ జారీచేసింది. అయితే మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ కు పదవి కట్టబెట్టాలని చూస్తుందని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తుంది.