ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి ఓ ఘాటు లేఖ రాశారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
Delhi CM Kejriwal letter to PM Modi
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి ఓ ఘాటు లేఖ రాశారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సహకార సమాఖ్యవాదం ఒక జోక్ అంటూ తన లేఖలో ఎద్దేవా చేశారు. సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండక పోతే న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలని ప్రజలు అడుగుతున్నారని కేజ్రీవాల్ తన లేఖలో ప్రధానిని ప్రశ్నించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
అధికారాల విషయంలో ఇటీవలే సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఖాతరు చేయని మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేరుగా ఢిల్లీ వచ్చి కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్స్ ను తప్పుబట్టారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమత బెనర్జీలు ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ప్రధానికి లేఖ రాశారు.