Sharechat: 600 మందిని తొలగించిన షేర్‌చాట్
Sharechat: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ లేఆఫ్స్‌ను ధ్రువీకరించిన షేర్‌చాట్ వ్యయాలు పెరిగిపోవడం, మూలధనం లభ్యత కొరవడటంతో కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదని.. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరులోని సంస్థ మొహల్లా టెక్ తెలిపింది. షేర్‌చాట్‌తోపాటు షార్ట్ వీడియో యాప్ మోజ్ కూడా 500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం షేర్‌చాట్ సంస్థలో 2,200 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో 20 శాతం అంటే దాదాపు 600 మందిని తొలగించనుంది.
2022 డిసెంబర్ వరకు వంద శాతం వేరియబుల్ పేని చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నోటీసు పీరియడ్ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లించనున్నారు. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాలా చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపింది. 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా సదుపాయం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ప్రయోజనాలు, ఐటి ఖర్చులు పెరగడంతో ఖర్చు భారీగా పెరిగిందని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యోగాల నియామకాల్లో ఇప్పుడు తొలగించిన వారికీ మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది.