Currency Rain: బెంగళూరులో కరెన్సీ వర్షం… ఎగబడ్డ జనం
Currency Rain in Bangalore: అప్పుడప్పుడూ మనం చేపల వర్షం, కప్పల వర్షం, వడగళ్ల వాన కురుస్తుండటం చూశాం. డబ్బుల వర్షం కురవడం ఎప్పుడైనా చూశారా అంటే లేదనే చెప్తాం. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియని సమయంలో డబ్బులు వర్షం రూపంలో కురిస్తే బాగుండని అందరూ అనుకుంటారు. ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరు నగరంలో జరిగింది.
బెంగళూరు నగరంలోని కేఆర్ మార్కెట్ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద కరెన్సీ వర్షం కురిసింది. డబ్బులు గాలిలో నుండి పడటంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వాహనాలను నిలిపివేసి డబ్బులు ఏరుకోవడం మొదలుపెట్టారు. వందలాది వాహనాలు ఆ మార్గంలో నిలిచిపోయాయి. బ్రిడ్జిపైనుండి ఓ వ్యక్తి డబ్బులను విసిరేయడంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం జరిగింది.
గుర్తు తెలియని వ్యక్తి సూటు బూటు ధరించి బ్రిడ్జిపై నుండి రూ. 10 నోట్లను వెదజల్లాడని అక్కడి ప్రజలు చెప్పుకొచ్చారు. నోడ్లు రోడ్లపై పడిపోవడంతో వాటిని ఏరుకునేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎందుకు ఆ వ్యక్తి డబ్బును అలా వెదజల్లాడు అన్నది అర్థం కాలేదు. అయితే, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి నానా తంటాలు పడ్డారు.