India Covid 19: ఇండియాలో తగ్గని కరోనా ఉదృతి… ఒక్కరోజులో
India Covid 19:దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 13,313 మందికి కరోనా సోకినట్లు భారత ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. 24 గంటల్లో కరోనాతో 38 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,33,44,958 మందికి కరోనా సోకగా 4,27,36,027 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, కరోనాతో ఇప్పటి వరకు 5,24,941 మంది మరణించారు. ఇకపోతే ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. దేశంలో కేసులు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.
కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలని పేర్కొన్నది. అంతేకాదు, వ్యాక్సిన్ తీసుకోనివారు ఉంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడం వలన వ్యాధి తీవ్రప్రభావం చూపదని కేంద్రం తెలియజేసింది. పెద్ద వయసుకలిగిన వ్యక్తులు తప్పనిసరిగా బూస్టర్ డోసులు తీసుకోవాలని పేర్కొన్నది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా కేసులు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు యాక్టీవ్ కేసుల సంఖ్య పెగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది.