Covid 19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..కోవాగ్జిన్ బూస్టర్ డోస్ తో
Covid 19: దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ భయపెడుతున్నాయి. మొన్నటి వరకు 20 వేల దిగువకు నమోదైన కేసులు ఈరోజు మళ్లీ 20 వేలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,566 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో 4,38,25,185 మందికి కరోనా సోకగా 4,31,50,434 మంది కరోనా నుంచి కొలుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దేశంలో 1,48,881యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన24 గంటల్లో కరోనాతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,870 కి చేరింది.
ఇక ఇదిలా ఉంటె, కొవాగ్జిన్’ బూస్టర్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నేచర్’ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు 184 మంది వాలంటీర్లపై ప్రయోగించినట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. కొవిడ్ వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వేరియంట్లను కొవాగ్జిన్ టీకా సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేలింది. దీంతో కొవాగ్జిన్ టీకా తీసుకున్న కొంతకాలానికి యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. టీసెల్ ప్రతిస్పందన మాత్రం 12 నెలల పాటు కనిపించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనివల్ల దీర్ఘకాలం పాటు బి-సెల్ మెమొరీ కూడా సాధ్యపడుతోందని వివరించింది. తొలి రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో ఆరు నెలల తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గుతోందని.. కానీ, బూస్టర్ డోసు తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతోందని భారత్ బయోటెక్ వెల్లడించింది.