Presidential Election Results: రాష్ట్రపతి ఎన్నిక..ఓట్ల లెక్కింపు నేడే..!
Presidential Election Results:నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే పార్లమెంట్ హౌస్కు చేర్చారు. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు అనంతరం రాష్ట్రాల వారీగా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఒకసారి, 20 రాష్ట్రాలు పూర్తయిన తరువాత మరోసారి ఫలితాల సరళిని ప్రకటిస్తారు.
రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని తెలుస్తుంది. 10,86,431 ఓట్ల ఎలక్టోరల్ కాలేజీలో మూడింట రెండొంతుల మార్కును ముర్ము దాటుతారని బీజేపీ అంచనా వేస్తుంది. జూలై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.