Corona Cases: కొనసాగుతున్న కరోనా ముప్పు, పలు దేశాల్లో వీర విహారం
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 20,408 కేసులు వెలుగుచూశాయి. 20,958 మంది కరోనా బారి నుంచి విముక్తి పొందారు. 47 మంది మాత్రం కరోనా కోరల్లో చిక్కి మరణించారు. దీంతో కరోనా కాటుకు బలైన వారి మొత్తం సంఖ్య 5,26,258కి చేరింది. కేంద్ర వైద్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 1,43,384 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.05శాతం ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 203.60 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు.
ఢిల్లీలో కొత్తగా 1128 కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అక్కడ తాజాగా 116 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 7,33,893 కేసులకు చేరింది. ఒడిషాలో కూడా 1020 కొత్త కేసులు వెలుగు చూశాయి.
➡️ 20,408 New Cases reported in last 24 hours. pic.twitter.com/UpRGlPTcgp
— Ministry of Health (@MoHFW_INDIA) July 30, 2022
కరోనా కొత్త వేరియంట్లు
కరోనాకు చెందిన కొత్త వేరియంట్లు ఏవీ దేశంలో ప్రవేశించలేదని కేంద్ర వైద్యశాఖ లోక్‌సభలో వెల్లడించింది. 2021 డిసెంబర్ నెలలో ఒమిక్రాన్ ప్రవేశం తర్వాత ఆందోళనకరమైన కరోనా వేరియంట్ ఏదీ దేశంలోకి ఎంట్రీ ఇవ్వలేదని జూలై 29న లోక్‌సభలో వెల్లడించారు.
అమెరికాలో కరోనా విజృంభణ
అమెరికాలో ఇటీవల కాలంలో కరోనా విజృంభణ ఎక్కువయింది. రోజుకు లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో బైడెన్ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. 66 మిలియన్ డోసులను కొనుగోలు చేసేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ మోడెర్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రభావవంతంగా పోరాడగలిగే ఈ వ్యాక్సిన్ డోసులను త్వరలోనే దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంది.
జపాన్‌లో కరోనా విలయతాండవం
జపాన్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో జపాన్‌లో 2 లక్షల 21 వేల 938 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కట్టడికి ఉన్న మార్గాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నిబంధనలను మరింత కఠినతరం చేశారు.