ఉపాధి కల్పనలో పల్లెల కంటే నగరాలే ప్రధమ స్థానంలో ఉన్నాయి.
New Cities : జనాభా (Population)లో ప్రపంచం (World)లోనే టాప్ ప్లేస్‌లో నిలిచిన ఇండియా (India)కు మునుముందు ఎదురయ్యే సవాళ్ల (Challenges) గురించి చాలా చర్చలే జరిగాయి. అందులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తి ప్రధాన సమస్య అయితే వారందరికీ సరైన ఉపాధి కల్పించటం. ఉపాధి కల్పనలో పల్లెల కంటే నగరాలే (Cities)ప్రధమ స్థానంలో ఉన్నాయి. అందుకే పల్లెలొదిలి జనం పట్నం బాట పట్టడంతో సిటీలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలా పట్టణీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో రోజు రోజుకూ జనాభా భారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త నగరాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం (Government) కసరత్తు చేస్తోంది.
పట్టణాలపై భారం తగ్గించటమే లక్ష్యం
ఇప్పుడున్న పట్టణాలపై భారం అన్నిరకాలుగా తగ్గించటానికి ఈ కొత్తనగరాల నిర్మాణాలు ఊహించనంత ఉపయోగపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పట్టణాల్లో అంతకంతకూ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని .. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ‘అర్బన్ 20’ సమావేశం తర్వాత కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ ఎంబీ సింగ్ వెల్లడించారు.
ప్రతిపాదనలేమిటి?
భవిష్యత్ వ్యూహంలో భాగంగా 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫారసు చేసింది. ఆర్థిక సంఘం సూచనల మేరకు పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలించాక ఎనిమిది కొత్త నగరాల ఏర్పాటును అధికారుల పరిశీలిస్తుననారు. ప్రస్తుతం ఉన్న నగరాలు ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నందున కొత్త వాటిని నిర్మించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తు చేశారు. ‘ఇప్పటికే ఉన్న నగరాల శివార్లలో అస్తవ్యస్తంగా విస్తరించడం వల్ల ఈ నగరాల ప్రాథమిక ప్రణాళికను ప్రభావితం చేస్తోంది.. కొత్త నగరం అభివృద్ధి చెందితే సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు కనీసం 200 కి.మీ వ్యాసార్థంలో పెరుగుతాయి’ అని ఎంబీ సింగ్ అన్నారు.
రోడ్ మ్యాప్ ఎప్పుడు?
అయితే, కొత్త నగరాల ఏర్పాటుపై రోడ్‌మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. దేశంలోని పౌరుల కోసం కొత్తవాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నందున ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.