Congress: ఉద్రిక్తంగా మారుతున్న కాంగ్రెస్ నిరసనలు
Congress Protests against Sonia gandhi ED Interrogation: సోనియాగాంధీ ఈడి విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించినందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. ‘ప్రజాస్వామ్యంపై దాడి చేయడం మానేయండి, ఈడీని రాజకీయంగా దుర్వినియోగం చేయడం ఆపండి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు ప్రదర్శించారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
సోనియాను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. అంతకుముందు రాహుల్ గాంధీని ఈడీ విచారించి సమయంలో కూడా ఆ పార్టీ ఇదే విధంగా ఆందోళనలకు దిగింది. ఈ కేసులో రాహుల్‌ను ఈడీ 50 గంటలకు పైగా ప్రశ్నించింది. ఇక నిరసనకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలపైవాటర్ కేనాన్స్ కూడా ప్రయోగించారు. ఇక ఏపీ, తెలంగాణ,కర్ణాటక,మహారాష్ట్ర,అస్సాం, బీహార్,బెంగాల్ లో సైతం కాంగ్రెస్ నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.