నిన్న వరంగల్ డిక్లరేషన్.. రేపు ఉదయ్‌పూర్ డిక్లరేషన్..
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13 నుంచి 15 వరకు రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో మేధోమథన సదస్సు నిర్వహించనుంది. అక్కడ జరిగే చర్చల అనంతరం ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’ పేరుతో నిర్ణయాలను ప్రకటిస్తారు. ఇప్పటికే వరంగల్ లో రైతు సంఘర్షణ సభ నిర్వహించి ‘వరంగల్ డిక్లరేషన్’ను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్ లో ఒక ముఖ్యాంశం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఒక కుటుంబం.. ఒకే టికెట్..
పార్టీ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ‘ఒక కుటుంబం ఒకే టికెట్’ అనే టాపిక్ పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రానున్న ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే టికెట్ ఇవ్వనున్నారు. ఆదివారం మరోసారి జరగబోయే సీడబ్ల్యూసీ భేటీలో ఈ నిబంధనను ఆమోదించనున్నట్లు సమాచారం.
ఆ ఒక్కరికి తప్ప..
ఈ రూల్ వల్ల సోనియాగాంధీ కుటుంబానికి ఇబ్బంది కలగనుంది. సోనియా, రాహుల్ ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల గాంధీ కుటుంబాన్ని ఈ నిబంధన నుంచి మినహాయించొచ్చని అంటున్నారు. అయితే.. ఈ మినహాయింపు అధికార పార్టీ బీజేపీకి మరో అస్త్రం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.