Sonia Gandhi: ఈడీ విచారణలో సోనియా.. పోలీసుల నిర్భంధంలో రాహుల్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో అధికారులు ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జూలై 21న 28 ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించిన అధికారులు నేడు మరోసారి సోనియా నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రపతికి విపక్షాల లేఖ
సోనియాగాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశాయి. కేంద్రం తీరును ఎండగట్టాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, ఈడి, సీబీఐ లను ఉసిగొల్పుతుందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. పార్లమెంట్ వేదికగా పలు ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ప్రతి పక్షాలు సిద్ధమైన వేళ, సభల్లో చర్చ జరగకుండా ఉండేందుకు కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి.
तानाशाही के विरुद्ध, जारी है युद्ध।
संसद परिसर में श्री @RahulGandhi जी के नेतृत्व में कांग्रेस सांसदों का सत्याग्रह…#SatyagrahaWithSoniaGandhi pic.twitter.com/b96k0Sji77
— INC TV (@INC_Television) July 26, 2022
కేంద్రం చర్చకు సిద్దంగా లేదు
కేంద్రం ఇటీవలే అనేక నిత్యావసర వస్తువులపై జీఎస్టీని విధించింది. సాధారణ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ విషయమై కేంద్రాన్ని టార్గెట్ చేయాలని విపక్షాలు భావించాయి. విపక్షాలు వ్యూహాన్ని తిప్పికొట్టడానికై కేంద్రం ఈడీ విచారణ పేరుతో సమావేశాలను తప్పదోవ పట్టిస్తోందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. జీఎస్టీ విధింపు అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీ అరెస్టు
సోనియాగాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన భారీ ర్యాలీలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం నుంచి బయలు దేరిన కాంగ్రెస్ ర్యాలీ విజయ్ చౌక్ మీదుగా సాగుతోంది. రంగంలో దిగిన పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు రంజిత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగోర్, ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ, కే సురేష్ తదితర కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు.
बड़ी खबर…
कांग्रेस नेता @RahulGandhi को
संसद भवन के बाहर से दिल्ली पुलिस ने हिरासत में लिया। pic.twitter.com/wFoGErs8Ks— INC TV (@INC_Television) July 26, 2022
కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
ఈడీ విచారణకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శులతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా దీక్షలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు.