Congress official Announcement: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేసింది. సిద్దరామయ్య కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారని వెల్లడించింది. ఇదే సమయంలో రాజీ ఫార్ములా గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 20న కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇందుకు సమయం ఖరారు చేసారు. పార్టీ అగ్రనాయకత్వం సుదీర్ఘ సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ప్రకటించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు అధికారికంగా ఖరారైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయం నుంచి సాగుతున్న పవర్ గేమ్ లో డెసిషన్ వచ్చేసింది. ఢిల్లీ కేంద్రంగా బుధవారం అర్ద్రరాత్రి వరకు జరిగిన మంతనాలు..బుజ్జ గింపులు..నిర్ణయాల పలితంగా ముందుగా సిద్దరామయ్య సీఎంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పవర్ షేరింగ్ పైన స్పందించటానికి నిరాకరించారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రచారం సాగుతున్నట్లుగా ముగ్గురు, నలుగురు ఉండరని స్పష్టం చేసారు. డీకే శివకుమార్ ఓక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని ప్రకటించారు. డిప్యూటీ సీఎంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకూ కర్ణాటక పీసీసీ చీఫ్ గా డీకే కొనసాగుతారని స్పష్టం చేసారు. దీని ద్వారా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో డీకే శివకుమార్ తన పట్టు కొనసాగించనున్నారు.
ఈ నెల20వ తేదీ మధ్నాహ్నం 12.30 గంటలకు కర్ణాటక కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటుగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ కార్యాలయం నుంచి నిర్ణయం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటుగా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. డీకే శివకుమార్ కు కీలకమైన రెండు శాఖలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు కావటంతో, ఇదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధిక సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డీకే శివకుమార్ కు ప్రభుత్వం..పార్టీలో ప్రాధాన్యతకు అంగీకరించింది. తమకు సిద్ద రామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ముఖ్యమని పార్టీ ప్రకటించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ఢిల్లీలో సిద్దూ, డీకే ఇద్దరినీ కలిపేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేసింది. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీట్ కు ఇద్దరినీ ఆహ్వానించారు. సూర్జేవాల కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఇద్దరికీ ఎక్కడా ప్రాదాన్యత తగ్గదని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. అక్కడ సమావేశం ముగిసిన తరువాత ఇద్దరు నేతలు కలిసి పార్టీ అధ్యక్షుడు ఖర్గే వద్దకు వెళ్లారు. కేబినెట్ లో మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైనా ఢిల్లీ కేంద్రంగా నిర్ణయం జరిగింది. రాహుల్ గాంధీతో ఇద్దరు నేతలు ఫోన్ లో సంభాషించారు. ఇద్దరు నేతల మధ్య హైకమాండ్ కుదిర్చిన రాజీ ఫార్ములాతో సిద్ధరామయ్య కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా ఈ నెల 20 మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.