CJI Fires on SC Bar Association President: నన్ను బెదిరించలేరు.. బయటకు వెళ్లిపోండి
CJI Fires on SC Bar Association President: సుప్రీంకోర్టులో గురువారం అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టీస్ కోర్టులో విచారణ సమయంలో సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ స్థలం విషయంలో చేసిన వ్యాఖ్యలతో గందరగోళం నెలకొన్నది. న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయింపుల విషయంలో చీఫ్ జస్టీస్, వికాస్ సింగ్ మధ్య తీవ్రమైన వాదనలు జరిగాయి. న్యాయవాదుల ఛాంబర్ల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా లిస్టింగ్ చేసి విచారణ చేపట్టాలని వికాస్ సింగ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనంలో విజ్ఞప్తి చేశారు. గత ఆరు నెలలుగా లిస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఈ కేసును ఒక సాధారణ కేసుగా పరిగణించి వేగిరంగా చర్యలు చేపట్టాలని కోరారు.
తాము వేసిన పిటిషన్ కారణంగానే అప్పూఘర్‌లోని భూమి సుప్రీంకోర్టుకు దక్కిందని, ఆ భూమిలో కొంతభాగాన్ని న్యాయవాదుల చాంబర్ల నిర్మాణం కోసం కేటాయించారని, జస్టీస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టీస్‌గా ఉన్న సమయంలో చాంబర్ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉన్నా కాలేకపోయిందని, పిటిషన్ కోసం తాను ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దీనిపై చీఫ్ జస్టీస్ స్పందిస్తూ ఈ పిటిషన్ ఈనెల 17వ తేదీన విచారణ చేపడతామని చెప్పారు. దానికి త్వరగా అయ్యేలా చూడాలని వికాస్ సింగ్ కోరడంతో జస్టీస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బెదిరించలేరని, తన 24 ఏళ్ల సర్వీసులో ఎవరికి బెదరలేదని, స్వరం పెంచవద్దని తన కోర్టు నుండి బయటకు వెళ్లిపోవాలని వికాస్ సింగ్‌ను ఆదేశించారు.