Midday meals: బెంగాల్ విద్యార్ధులకు చికెన్ మీల్స్, మమత సర్కార్ నిర్ణయం
Chicken, eggs to be served in Government Schools in Bengal
బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి మిడ్ డే మీల్స్ లో చికెన్ కర్రీ, ఎగ్స్ అందిస్తామని తెలిపింది. వాటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ అందించేందుకు సమాయాత్తం అయింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
ప్రతి రోజూ వడ్డించే అన్నం, పప్పు, కూరగాయలతో పాటు చికెన్, ఎగ్స్ కూడా విద్యార్ధుల భోజనంలో జత చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ విధానం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
బెంగాల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కోటీ 16 లక్షల విద్యార్ధులకు ఇక చికెన్ మీల్స్ అందనుంది. కొత్త మెనూను అమలు చేయడానికి అదనంగా 371 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
మిడ్ డే మీల్స్ అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతి విద్యార్ధిపై 20 రూపాయలు ఖర్చు చేయనుంది. 16 వారాల పాటు అమలు కానున్న కొత్త విధానం ప్రకారం ప్రతి విద్యార్ధికి 320 రూపాయలు ఖర్చు కానుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అందించే మిడ్ డే మీల్స్ పథకానికి కేంద్రం కూడా నిధులు అందిస్తోంది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి నిధులను కూడా పెంచింది. ప్రస్తుతం కేంద్రం రాష్ట్రం నిధుల కేటాయింపు విధానం 60:40 నిష్ఫత్తిన కొనసాగుతోంది.
ఏప్రిల్ నెలలో బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మమత బెనర్జీ సర్కార్ ఇటువంటి పథకాలను అమలు చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.