Same Sex Marriage: స్వలింగ సంపర్క వివాహాలకు కేంద్రం రెడ్ సిగ్నల్, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
Centre opposes legal recognition of same-sex marriage
స్వలింగ సంపర్క వివాహాలపై కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం.. నేరరహిత స్వలింగ సంపర్కుల వివాహానికి గుర్తింపు కోరే దావాకు దారితీయదని సుప్రీంకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. భిన్న లింగ స్వభావానికి పరిమితమైన వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో ఆనవాయితీగా ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
వివాహమనే భావన అనివార్యంగా వ్యతిరేక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఐక్యతను సూచిస్తుందని కేంద్రం తెలిపింది. ఈ నిర్వచనం సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహ ఆలోచన, భావనలో పాతుకుపోయింది. దీనికి న్యాయపరమైన వివరణ ద్వారా భంగం కలిగించకూడదని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది.
2018లో కీలక తీర్పు
స్వలింగ సంపర్కుల విషయంలో 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. స్వలింగ సంపర్కాన్ని అప్పటి వరకు నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. స్వలింగ సంపర్క వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలని కోరుతూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది.