All Party Meeting In Srilanka Crisis:శ్రీలంక సంక్షోభం పై ముగిసిన అఖిలపక్ష భేటీ..తెలుగు రాష్ట్రాల అప్పుల పై రచ్చ..!
All Party Meeting In Srilanka Crisis:ఢిల్లీలో శ్రీలంక సంక్షోభంపై అఖిల పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో శ్రీలంక సంక్షోభంపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీలంక పరిస్థితితో పాటు, ఏపి, తెలంగాణ అప్పులను కేంద్ర ప్రభుత్వం వివరించింది. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి స్థాయుకి మించి అపరిమితంగా చేసిన అప్పులే కారణమంటూ విశ్లేషణాత్మకంగా వివరించింది. పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపైనా రెండో ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పులు చేటు చేస్తాయని ఆర్దిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఆల్‌పార్టీ మీట్లో విదేశీ వ్యవహరాల మంత్రి జైశంకర్ పాల్గొన్నారు.
మరోవైపు అప్పుల పై కేంద్రం తీరును టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు,నామా నాగేశ్వరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది రాజకీయ దురుద్దేశమని మండిపడ్డారు. పరిమితికి మించి కేంద్రం చేసే అప్పులపై కూడా తెలపాలని కేశవరావు, నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో నామా నాగేశ్వరరావు నొక్కి చెప్పారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని విమర్శించారు.