EC on Vote From Home Option: ఈసీ కీలక నిర్ణయం… ఇంటి నుండే ఓటు హక్కు వినియోగం
EC on Vote From Home Option: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. ఇప్పటికే వలస ఓటర్లు సొంత గ్రామాలకు వెళ్లనవసరం లేకుండా ఉన్న చోటు నుండే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రిమోట్ ఓటింగ్ మిషిన్ ను తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
80 సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటినుండే ఓటుహక్కును వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. రాబోయే త్రిపుర శాసనసభ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపుర శాసనసభకు ఫిబ్రవరి 16వ తేదీన, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక, మూడు రాష్ట్రాల్లో మొత్తం 31,700 మంది దివ్యాంగుల ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ తెలియజేసింది. బందోబస్తు కోసం కేంద్ర బలగాల సహాయం తీసుకోనున్నట్లు ఈసీ ప్రకటించింది.