Lok Sabha: కాళేశ్వరంపై కేంద్రం కీలక ప్రకటన
Kaleswaram project:తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదన్న కేంద్రం.. ఈ కారణంగానే ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర జల శక్తి శాఖ పార్లమెంట్లో సమాధానం చెప్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తున్న నరేంద్ర మోడీ సర్కారు.. తెలంగాణలో కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న వేళ కేంద్రం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వక పోగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం జాతీయ హోదా కల్పించక పోవడంతో టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇంత కాలం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయమన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు నీటిలో మునిగిపోయిన ప్రాజెక్టును ఆదుకోవాలని కూడా చూడటం లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీజేపీ ఎంపీ స్పందించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కేంద్రానికి తెలపలేదన్నారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు మొత్తం ఆగమైందన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ కేంద్రానికి ఇవ్వలేదన్న లక్ష్మణ్.. అందుకే కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిందని ఎంపీ పేర్కొన్నారు.