200 New TV Channels for Education: దేశంలో 200 కొత్త టీవీ ఛానళ్లు..రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం
కరోనా తరువాత దేశంలోని విద్యా విధానంలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. దేశంలో విద్య కోసం 200 టీవీ ఛానళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం కేంద్రం సుమారు రూ. 100 కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశంలో మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు, యువతకు మంచి విద్యను అందించడంలో భాగంగా ఈ ఛానళ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ సెంటర్, ఈ క్లాస్‌రూమ్ బిల్డింగ్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిమోట్ ఏరియాల్లోని విద్యార్థులకు విద్యను అందించే విషయంపై మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోందని అన్నారు. ఒక్కో క్లాస్‌కు ఒక్కో ఛానల్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఇండియాలోని అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ ఛానల్ అందుబాటులో ఉంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.