కరోనా మరణాలపై కేంద్రం తప్పుడు లెక్కలు చూపించింది: రాహుల్ గాంధీ
భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మృతులపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. కోవిడ్ మరణాలపై భారత ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది.
దీంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నిజాలు చెప్పరని, చెప్పేవారిని చెప్పనివ్వరని విమర్శించారు. ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ మరణించలేదని మోడీ చెప్పుకుంటూ వచ్చారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక మంది అమాయకుల ప్రాణాలు పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్ వల్ల 40 లక్షల మంది మరణిస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 5 లక్షల మంది మాత్రమే మరణించారని తప్పుడు లెక్కలు చెప్పారని మండిపడ్డారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.