CBI Raid: మనీష్ సిసోడియాపై రైడ్స్.. మేము కాదంటున్న సీబీఐ?
Manish Sisodia CBI Raid: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం తన కార్యాలయంలో సీబీఐ దాడులు చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సిసోడియా ట్వీట్ ద్వారా తెలియజేశారు. ‘’ఈ రోజు మళ్లీ సీబీఐ నా కార్యాలయానికి చేరుకుంది. వారికి స్వాగతం. వారు నా ఇంటిపై దాడి చేశారు, నా కార్యాలయంపై దాడి చేశారు, నా లాకర్‌ను శోధించారు, మా గ్రామంలో కూడా దాడి చేశారు. నాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనబడలేదు, కనుగొనబడదు. ఎందుకంటే నేనేమీ తప్పు చేయలేదు’’ అని పేర్కొన్నారు. ఢిల్లీ పిల్లల చదువు కోసం చిత్తశుద్ధితో కృషి చేశానని అన్నారు. అయితే సీబీఐ ఆయన వాదనను కొట్టిపారేసింది, మేము ఎలాంటి దాడులు లేదా సోదాలు నిర్వహించలేదని పేర్కొంది. మరోవైపు సీబీఐ దాడులపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోదీపై విరుచుకుపడింది.
మరోసారి మోదీ జీ సీబీఐ మనీష్ సిసోడియా కార్యాలయానికి చేరుకుందని పార్టీ ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఇంతకు ముందు జరిగిన దాడిలో ఏం దొరికిందో ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకంటే ఇల్లు, ఆఫీస్, బ్యాంక్ లాకర్ అలాగే మనీష్ జీ గ్రామంలో కూడా వెతికిన తర్వాత, వారికి ఒక ‘ఝుంఝునా’ మాత్రమే దొరికిందని పార్టీ ఎద్దేవా చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఏడాది మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 20 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పలుమార్లు మనీష్ సిసోడియా నివాసం కార్యాలయంలో సీబీఐ దాడులు చేయగా ఇప్పుడు దాడులు చేసింది ఎవరు? అనే అంశం చర్చనీయాంశం అవుతోంది. ఎక్సైజ్ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా సిఫార్సు చేశారు. ప్రధాన కార్యదర్శి నివేదిక ఆధారంగా ఎల్జీ విచారణకు సిఫార్సు చేశారు. నిజానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో మనీష్ సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. జిఎన్‌సిటిడి చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009 మరియు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010 నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.