Bihar: బీహార్‌లో మొదలైన కులగణన… ఇదే తొలిసారి
Bihar: బీహార్ రాష్ట్రంలో కుల గణనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం శనివారం రోజున ప్రారంభించింది. రెండు దశల్లో ఈ కుల గణనను చేపట్టనున్నారు. మొదటిదశలో రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్యను లెక్కిస్తారు. ఆ నమోదు కార్యక్రమం జనవరి 21తో ముగుస్తుంది. అనంతరం రెండో దశ సర్వేను మార్చినెలలో ప్రారంభించనున్నారు. ఈ రెండోదశలో కులాలు, ఉపకులాలు, వృత్తులు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వార్షిక ఆదాయ వివరాలు వంటి వాటిని నమోదు చేస్తారు. ఈ నమోదు ఆధారంగా రాష్ట్రంలో ఏయే కులాలు ఎన్నున్నాయి, వారి ఆర్థిక వివరాలు అన్ని ప్రభుత్వానికి చేరుతాయి. ఈ వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది.
ఇక, ఈ కులగణన కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లను కేటాయించింది. కుల గణన వివరాలను సేకరిస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరెవరికి ఎంతెంత చేరుతున్నాయనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ కుల గణన చేపడితే దేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని, రిజర్వేషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కులగణనను నిర్వహించడం లేదు. కేవలం జనగణనను మాత్రమే చేస్తున్నది. 1931లో దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టారు.
అ నివేదికల ఆధారంగానే నేటికి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 1941లో రెండోసారి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టాలని చూసినా రెండో ప్రపంచ యుద్ధం కారణంగా సాధ్యపడలేదు. ఇక 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల జనగణనను చేపట్టినా ఆ వివరాలను బహిర్గతం చేయలేదు. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం ఈ కులగణనను చేపట్టడంతో మళ్లీ ఈ డిమాండ్ ఊపందుకునే అవకాశం ఉంటుంది.