BRS Huge Meeting: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ.. ముగ్గురు సీఎంలకు ఆహ్వానం?
BRS to Conduct a Huge Meeting at Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 18న ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సభకు మూడు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఖమ్మంలో సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. ఖమ్మం జిల్లా ఏపీ సరిహద్దులో ఉంటుంది కాబట్టి ఖమ్మం చుట్టుపక్కల ఉన్న తెలంగాణ జిల్లాల నుంచే కాక అక్కడి నుండి ఈ సభకు జనాన్ని సమీకరించాలని కూడా పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఆ జిల్లా కు చెందిన ప్రజా ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఇక ఈ బహిరంగ సభ బాధ్యతలు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలకి అప్పగించారు. ఈ సభకు సీఎంలు హాజరయితే బీఆర్ఎస్ విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లను ఆహ్వానించామని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.