Poaching Case In SC: కేసీఆర్ వీడియోలు ఎలా పంపుతారు..ప్రశ్నించిన సుప్రీంకోర్టు..
BRS MLAs Poaching Case hearing started in Supreme Court
రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సిబిఐకి అప్పగించడం పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐ దర్యాప్తు చేయాలన్న హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేల ఎర కేసులో అక్టోబర్ 26 FIR నమోదు అయిందని, నవంబర్ 8న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని మరోసారి అందరికీ వివరించారని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. కేసు విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని, పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి సీఎం మాట్లాడారని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు పంపారు. ఇవాళ కేసు విచారణ సందర్భంగా దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆడియో, వీడియోలను న్యాయమూర్తులకు ఎలా పంపుతారని జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఫాం హౌస్ కేసులో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. కేసుకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్పులను పంపినందుకు న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు.
గతేడాది డిసెంబర్ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును ఫిబ్రవరి 5న డివిజన్ బెంచ్ సమర్ధించింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.