Jantar Mantar: మహిళా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తా – కవిత
Kavitha Deeksha at Jantar Mantar in Delhi
మహిళలకు చట్ట సభల్లో తగిన స్థానం కల్పించే వరకు తన పోరాటం కొనసాగుతుందని భారత రాష్ట్ర సమితి నాయకురాలు కవిత అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. మన దేశంలో తరతరాలుగా స్త్రీలకు లభిస్తున్న ప్రాముఖ్యతను కవిత వివరించారు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని అన్నారు. అమ్మా నాన్నలు, రాధే శ్యామ్, పార్వతీ పరమేశ్వర్ అనే పేర్లలలో ముందు పేరు స్త్రీలదేనని కవిత గుర్తుచేశారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, భారత దేశంలో కూడా మహిళలు అనేక రంగాల్లో ఉన్నతి సాధిస్తున్న విషయాన్ని కవిత గుర్తుచేశారు. భారతదేశంలో రాజకీయంగా మహిళలు ఎదగాలంటే వారిక ఖచ్చితంగా చట్ట సభల్లో తగినరీతిలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని కవిత గుర్తుచేశారు.
మహిళా రిజర్వేషన్ల కోసం దేశంలో ఎంతో మంది మహిళలు ఇప్పటి వరకు పోరాటం చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 1996లో దేవగౌడ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయాన్ని కవిత గుర్తుచేసుకున్నారు. అంతకు పదేళ్ల క్రితం నుంచి ఎందరో మహిళలు చేసిన పోరాట ఫలితంగానే 1996లో పార్లమెంటులో దేవగౌడ్ బిల్లు ప్రవేశపెట్టారని కవిత గుర్తుచేశారు. బృందాకారత్, సోనియాగాంధీ, జయంతి నటరాజన్, సుష్మాస్వరాజ్ వంటి దిగ్గజ నేతలతో పాటు అనేక మహిళా సంఘాలు కూడా అలుపెరుగని పోరాటం చేశారని కవిత గుర్తుచేశారు.