Vice Presidential Elections: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం..!
NDA Vice President Candidate Decided Today: ఈనెల 18 వ తేదీన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజుతో అంటే జులై 19 వ తేదీతో ఉపరాష్ట్రపతి నామినేషన్లు ముగియనున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక పై ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో అనేక మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా ముక్తార్ అబ్బాస్ నక్వీ మాత్రం రేసులో ముందున్నారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మైనారిటీ శాఖా మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకే ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం నుంచి ముక్తార్ అబ్బాస్ నక్వీ కి స్పష్టమైన హామీ వచ్చిందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సంఘ్ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ఎన్డీయే తరపున ఎవర్ని పోటీకి దించనున్నారో తెలిసిన తరువాత విపక్షాలు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా బీజేపీ ఖరారు చేయనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటి పై జరిగే చర్చలో పాల్గొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నది.