Janardhan Mishra: మధ్యప్రదేశ్‌లోని రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగాలని గుట్కా నమలాలని, థిన్నర్ ను పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. చేతులతో టాయిలెట్లు శుభ్రం చేసి వార్తల్లో నిలిచిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.. మరోమారు హెడ్‌లైన్స్‌కి ఎక్కారు.
ఈసారి నీటి పొదుపు అంశంపై ఆయన సంచలన వ్యాఖ్యలుచేసాడు. నీటిని పొదుపు చేసేందుకు ప్రజలు గుట్కా తినాలని, మద్యం ఎక్కువగా సేవించాలని పిలుపునిచ్చారు. జనార్దన్ మిశ్రా ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
వాటర్ కన్సర్వేషన్ అంశంపై మధ్యప్రదేశ్ రేవాలోని కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో ఇటీవలే ఓ వర్క్‌షాప్ జరిగింది. ఇందులో.. రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. భుమి మీద నీరు ఉండటం లేదు. నీటిని పొదుపు చేయాలి. గుట్కా అయినా తినండి, లేదా మద్యాన్ని అయినా తాగండి, అయోడెక్స్ అయినా ఎక్కువగా తినండి. ఏమైనా చేయండి, కానీ నీటిని ఆదా చేయండి. మీరు ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు. కానీ నీటి పొదుపు విలువను మాత్రం అర్ధం చేసుకోండి అని జనార్దన్ మిశ్రా అన్నారు.
వాటర్ ట్యాక్స్‌పై ప్రభుత్వం తగ్గింపును ఇస్తే మీరు వ్యతిరేకించండి. వాటర్ ట్యాక్స్‌ను కడతామని కావాలంటే ఇతర పన్నులను తగ్గించాలని మీరు డిమాండ్ చేయండని బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నాయకులూ మండిపడుతున్నారు. యువతను, ప్రజలను చెడువ్యసనాలపై ఉసిగొల్పుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.