Tripura CM Manik Saha: మళ్లీ సాహాకే పట్టం
Tripura CM Manik Saha: త్రిపుర రాష్ట్రానికి ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికలు జరిగాయి. కాగా, ఈ ఎన్నికల ఫలితాలను మార్చి 2వ తేదీన ప్రకటించారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 32 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా మిత్రపక్షం ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఒక స్థానంలో విజయం సాధించింది. అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని బీజేపీ క్రాస్ చేసింది. అయితే, ఆదివాసీలకు చెందిన తిప్రా మోథా పార్టీ 13 స్థానాల్లోనూ, సీపీఎం 11 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించింది.
బీజేపీ కూటమికే మెజారిటీ రావడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై తర్జనభర్జనలు జరిగాయి. అధిష్టానం సూచనల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా మాణిక్ సాహాను మరోసారి ఎంచుకున్నారు. దీంతో మాణిక్ సాహా రెండోమారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి నేడు మాణిక్ సాహా గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నది. మార్చి 8 వ తేదీన మాణిక్ సాహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పీఎం మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు హాజరుకానున్నారు.