Bandi Sanjay: రేపు విచారణకు రాలేను.. మహిళా కమిషన్ కు బండి లేఖ!
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ కవిత గురించి కామెంట్ చేశారు. ఆ సమయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ”ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా?” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగి బండి సంజయ్ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు చేపట్టాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకి నోటీసులు కూడా ఇచ్చింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించగా తాజాగా ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. కమిషన్ ఆయనను ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొనగా.. రేపు రాలేనని పార్లమెంట్ కు హాజరు అవుతాను కాబట్టి తాను ఈనెల 18న విచారణకు హాజరవుతానని కమిషన్ కు లేఖ రాశారు. ఆయన లేఖ పై మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.