Amritsar: పంజాబ్ లో శివసేన అతివాద నేత పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. సుధీర్ సూరి అమృత్ సర్ లోని ఓ గుడి వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై ఓ అగంతకుడు సమీపం నుంచి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తరలించినా బతికించలేకపోయారు. సూరీ కొన్ని సిక్కు దుస్తులను, ఖలిస్తాన్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఆవేశపూరిత, మతపరమైన పోస్టులు, వీడియోలు పెడుతుంటాడని తేలింది.
ఓ ఆలయం నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుటుంటున్నాయంటూ ఆందోళనకు దిగారు సుధీర్ సూరి . ఆలయం బయట నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే స్థానికంగా ఉన్న ఓ షాపు యజమాని పిస్టల్ తో ఆయన్ను కాల్చాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలారు. సుధీర్ కు ప్రాణహాని ఉండటంతో పోలీసులు అదనపు భద్రత కూడాకల్పిస్తున్నారు. అయినా ఆయన్ను కాపాడలేకపోయారు. సూరిపై కాల్పులు జరిపిన సందీప్ సింగ్ ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని నగర పోలీసు చీఫ్ కమీషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు.