AAP: కేజ్రీవాల్ క్యాబినెట్ లో కొత్త ముఖాలు, సౌరవ్ తివారీ, అతిషిలకు మంత్రి పదవులు
Atishi, Saurabh Bharadwaj become Delhi ministers in Kejriwal cabinet
ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరు ప్రస్తుతం జైల్లో ఉండడంతో అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. జైల్లో ఉన్న ఇద్దరి మంత్రుల రాజీనామాలు ఆమోదించిన తర్వాత ఇద్దరు కొత్త నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. అతిషి, సౌరవ్ భరద్వాజ్ లకు మంత్రి పదవులు అప్పగించారు.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతం నుంచి ఆప్ నేత భరద్వాజ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేజ్రీవాల్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అదే విధంగా కల్కాజీ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అతిషి కూడా ఆప్ చేసిన అనేక పోరాటాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పార్టీ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలోను, బీజేపీని ఎండగట్టడంలోను ఆమె ముందున్నారు.
సత్యేంద్ర జైన్ కొన్ని నెలల క్రితం జైలు పాలయ్యారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా రెండు రోజుల క్రితం జైలు పాలయ్యారు. వీరిద్దరూ జైలులో ఉన్న కారణంగా కొత్తవారికి ఛాన్స్ లభించింది.
సిసోడియా అరెస్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి అనేక కష్టాలు వచ్చి పడ్డాయి. సిసోడియా ఉన్నంత కాలం పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. అధినేత కేజ్రీవాల్ పై భారం లేకుండా చూసుకునేవారు. సిసోడియా ప్రభుత్వ పనులను చక్కబెడితే, కేజ్రీవాల్ పార్టీ బాధ్యతలు చూసుకునేవారు. దేశ వ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సిసోడియా అరెస్టు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది.